మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా అగ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈసీకి లేఖ రాశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ పోలింగ్ డేటాలోనూ తేడాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాసిన లేఖపై ఈసీ తాజాగా స్పందించింది. ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది. కాంగ్రెస్ నేతల చట్టపరమైన ఆందోళనను తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. వారికి ఫలితాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది. ఈమేరకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు రావాలని ఆహ్వానించింది. ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాతే రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవలే వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. కూటమిలోని బీజేపీకి 132, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు 16, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.