Saturday, December 7, 2024
Homeజాతీయంఅత్యాచారం కేసులో నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష‌

అత్యాచారం కేసులో నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష‌

Date:

స‌వ‌తి కూతురుపై ఒక వ్య‌క్తి కొన్ని ఏళ్లుగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన కుటుంబం పని కోసం కేరళకు వలస వచ్చింది. అయితే 2017 నుంచి 2020 వరకు సవతి తండ్రి సవతి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ బాలికపై అత్యాచారం చేసేవాడు.

బాధిత బాలిక ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె సూచనతో సవతి తండ్రి అకృత్యాలను తల్లికి వివరించింది. దీంతో 2021లో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సవతి తండ్రిని అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టంతోపాటు, ఐపీఎస్‌, జువెనైల్‌ జస్టిస్‌ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో బెయిల్‌పై విడుదలైన ఆ వ్యక్తి సవతి కుమార్తెపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై మరో కేసు నమోదైంది.

మరోవైపు మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ రెండు కేసులపై విచారణ జరిపింది. నవంబర్ 29న జడ్జి అష్రఫ్ ఏఎం తీర్పు ఇచ్చారు. సవతి కుమార్తెపై ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ చట్టాలతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం రెండు కేసుల్లో మొత్తం 141 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు పేర్కొంది. దీంతో ఆ వ్యక్తి గరిష్ఠంగా 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే దోషికి రూ.7.85 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. బాధితురాలికి ఈ నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.