రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం వేలాది మంది ప్రాణాలు తీయగా, ఎంతోమంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఓ వైపు కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నా దాడుల తీవ్రత మాత్రం ఆగడం లేదు. తాజాగా మరణాల సంఖ్య 40వేలు దాటినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. అందులో ఎంతమంది మిలిటెంట్లు ఉన్నారనే విషయం చెప్పనప్పటికీ.. చిన్నారులు, మహిళలు అధికంగా చనిపోతున్నట్లు సమాచారం.
ఆసుపత్రుల్లో వందలాది చిన్నారులు..
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న వరుస దాడులతో వేల మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. పుట్టిన నాలుగు రోజులకే కవల పిల్లలను కోల్పోయిన ఓ తండ్రి పడుతున్న వేదన వర్ణణాతీతం. చిన్నారుల బర్త్ సర్టిఫికేట్ తెచ్చేందుకు వెళ్లిన అతడు.. తిరిగి ఆశ్రయం పొందుతున్న శిబిరానికి వచ్చేసరికి కవలలతోపాటు భార్య కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో కన్నుమూయడం కంటతడి పెట్టిస్తోంది. ఇదొక్కటే కాదు.. సైనిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు మోసుకెళ్తున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తీవ్ర గాయాలతో వందలాది చిన్నారులు ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
తాగునీటి కొరత..
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. లక్షల మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఔషధాలు, ఆహారం, మంచినీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడంతో అక్కడి వారిని వ్యాధుల భయం వెంటాడుతోంది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిపైనా ఇజ్రాయెల్ దాడులు జరుపుతుండడంతో సామాన్య పౌరుల మరణాలు అధికంగా ఉంటున్నాయి.