Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంహెజ్‌బొల్లా కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు

హెజ్‌బొల్లా కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు

Date:

హెజ్‌బొల్లా కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు అట్టిపెట్టామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్‌ గాలంట్ వ్యాఖ్యలు చేశారు. ఒక‌దాని తర్వాత ఒకటి హెజ్‌బొల్లాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేం నస్రల్లా (హెజ్‌బొల్లా చీఫ్‌)ను అంతంచేశాం. మరికొన్ని సర్‌ప్రైజ్‌లు అట్టిపెట్టాం. వాటిలో కొన్నింటిని పూర్తిచేశాం. మరికొన్ని పూర్తికానున్నాయి” అని సైనికాధికారులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే.. నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా ప్రచారంలో ఉన్న హషీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హషీమ్‌ ఓ అండర్‌గ్రౌండ్‌ బంకర్‌లో సీనియర్‌ హెజ్‌బొల్లా నేతలతో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెలీ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనలో హషీమ్‌ గాయపడ్డాడా?అతడి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.

గత శుక్రవారం బీరుట్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు విరుచుకుపడడంతో హసన్‌ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరాన్‌ డిప్యూటీ కమాండర్‌ జనరల్‌ అబ్బాస్‌ నీలోఫరసన్‌, హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ అలీ కర్కి సహా మరికొంత మంది కమాండర్లూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ రెండు రోజుల క్రితం సుమారు 200 బాలిస్టిక్‌ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దానిపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ పరిణామాల వేళ పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలముకున్నాయి.