ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా లక్ష్యంగా భీకర స్థాయిలో విరుచుకుపడింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ”నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు” అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ వార్ రూమ్ దీనిపై స్పందించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ మిషన్ విజయవంతమైనట్లు వెల్లడించింది.
శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నస్రల్లా ఇదే కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశాలు లేవని ఆ తర్వాత ఐడీఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా అతడు మృతిచెందినట్లు ధ్రువీకరించింది.