థాయ్‌ల్యాండ్ బ్యాంకాక్‌లో పాఠశాల విద్యార్థులు, వారి టీచర్‌ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగివస్తుండగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 25మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. థాయ్‌ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా మృతులకు సంతాపం తెలిపారు. విద్యార్థులు ట్రిప్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
థాయ్‌ల్యాండ్ రవాణశాఖా మంత్రి ఈ ప్రమాదం వివరాలను వెల్లడించింది. ”మొత్తం 44 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. వీరిలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత లేదు” అని పేర్కొన్నారు. ఇటీరియర్ మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ మాట్లాడుతూ మృతుల సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేమని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా.. 25 మంది చనిపోయి ఉండొచ్చన్నారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా.. మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉండిపోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై ఆన్‌లైన్‌లో పోస్టు అయిన వీడియోల్లో బస్సు నుంచి నల్లటి పొగ, భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల వయస్సు ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఒక టైరు పేలిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ సంస్థ తాము 10కిపైగా మృతదేహాలను చూసినట్లు ఫేస్‌బుక్‌లో పేర్కొంది.