Saturday, November 9, 2024
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో బీభ‌త్సం సృష్టిస్తున్న వ‌ర‌ద‌లు

నేపాల్‌లో బీభ‌త్సం సృష్టిస్తున్న వ‌ర‌ద‌లు

Date:

గ‌తకొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు వ‌ల్ల నేపాల్‌లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. వ‌ర్షాల వ‌ల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 39మంది మరణించారు. సుమారు 11మంది గల్లంతైనట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. ఈ వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు.

వరదలు పోటెత్తుతుండటంతో ఖాఠ్‌మాండూలో 9మంది, లలిత్‌పూర్‌లో 16 మంది, భక్తపూర్‌లో ఐదుగురు, కవ్రేపాలన్‌చౌక్‌లో ముగ్గురు, పంచతార్, ధన్‌కూటాలో ఇద్దరు, ఝాపా, ధాడింగ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 226 ఇళ్లు పూర్తిగా నీటమునిగిపోయాయని, బాధిత ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన 1,947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 రాఫ్టింగ్ బోట్లను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లుగా వెల్లడించారు.

బీహార్‌పై వ‌ర‌ద‌ల ప్ర‌వాహాం..

పొరుగు దేశం నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కాగా ఈ ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బిహార్‌లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ, తూర్పు చంపారన్, సీతామర్హి, షెయొర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, పట్నా, జెహనాబాద్, మధుబని, భోజ్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోసి, గండక్ నదులు ఉప్పొంగుతుండటంతో జలవనరుల శాఖ ఇప్పటికే వరద హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా గండక్ నదిపై ఉన్న వాల్మీకినగర్ బ్యారేజీలో కొన్ని గేట్లను ఎత్తి 6.87 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొంది.