బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో వందల మంది చనిపోయారు. నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా, సోమవారం తిరిగి మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో 300 మంది చనిపోయారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆఫీసులోకి ఆందోళనకారులు ప్రవేశించారు. దేశంలో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా ఉండటంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం దేశం విడిచి వెళ్లింది
కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలతో దేశం అట్టుడుకిపోతోంది. ఈ క్రమంలో ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్‌లైన్ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిముషాల డెడ్‌లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. షేక్ హసీనా టార్గెట్ గా ఆందోళన కారులు ప్రధాని ఆఫీసులోకి దూసుకెళ్లారు. ఆర్మీ ద్వారా సమాచారాన్ని పొందిన ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆర్మీ హెలికాప్టర్ లో షేక్ హసీనా దేశం దాటారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. కోట్ల మంది జనం రోడ్లపై రక్తపాతం సృష్టిస్తున్నారు. వందల మంది పోలీస్ కాల్పుల్లో.. విధ్వంసంలో చనిపోతున్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పరిస్థితులు చేయిదాటి పోవటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయారు
ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లటంపై సొమ్మిలిటో గార్మెంట్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నజీం అక్తర్ స్పందించారు. షేక్ హసీనా దేశాన్ని చంపేశారు.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు.. దేశ జనాన్ని చంపారు అంటూ వ్యాఖ్యానించారు. ఆమె ఎప్పుడూ దేశాన్ని ప్రేమించలేదని.. అవకాశం తీసుకుని నాశనం చేశారంటూ అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ చరిత్రలో ఇలా జరగటం దురదృష్టకరమని నజీం అక్తర్ అన్నారు.