Thursday, October 10, 2024
Homeఅంతర్జాతీయంత‌మ దేశంలో మీరు అడుగుపెట్టొద్దు

త‌మ దేశంలో మీరు అడుగుపెట్టొద్దు

Date:

ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెరస్‎ తమ దేశంలో అడుగుపెట్టొద్దని ఈ మేరకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంపై ఇరాన్ చేసిన దాడుల విషయంలో యూఎన్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటన చేశాడు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఇజ్రాయెల్ లో అడుగుపెట్టకుండా నిషేదం విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ పట్ల ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అందుకే ఆంటోనియో గుటెర్రెస్‌‎ను “పర్సనా నాన్ గ్రేటా”గా ప్రకటిస్తున్నామని తెలిపారు. పర్సనా నాన్ గ్రేటా ప్రకటన ద్వారా అతడికి ఇజ్రాయెల్‎లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఆయన మద్దతు ఇస్తున్నారని కాట్జ్ ఆరోపించారు. గుటెర్రెస్ యూఎన్ చరిత్రలో ఒక మాయని మచ్చగా గుర్తుండిపోతాడని విమర్శించారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేసిన దారుణమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరికైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోవడంతో పాటు.. ఆంటోనియో గుటెర్రెస్‌ వంటి వారు లేకున్నా తమ దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. కాగా, ఇజ్రాయెల్‎పై ఇరాన్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం (అక్టోబర్ 1) ఇజ్రాయెల్ పై రాకెట్లు, బాంబులతో ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడి అనంతరం యూఎన్ చీఫ్‎పై ఇజ్రాయెల్ నిషేదాజ్ఞలు విధించడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‎గా మారింది.