అపర కుబేరుడు ఎలాన్ మస్క్ 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్లు పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన విజయంతో మస్క్ షేర్లు పుంజుకున్నాయి. యూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరిగాయి. కంపెనీ స్టాక్స్ శుకవారం 3.8శాతం లాభంతో 352.56 డాలర్ల వద్ద ముగిసింది. గత మూడేళ్లలో ఇంత స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. స్టాక్స్ పెరుగుదల నేపథ్యంలో మస్క్ సంపద 7 బిలియన్లు పెరుగుదల నమోదైంది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం నిర్వహించారు. ఆయనకు 100 మిలియన్ డాలర్స్‌ని విరాళంగా అందించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్.. మస్క్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ చీఫ్‌గా నియమించారు. భారతీయ వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి ఈ హోదాలో పని చేయనున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 235.3 బిలియన్లతో ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ రెండోస్థానంలో ఉన్నారు. ఎల్లిసన్ కంటే 80 బిలియన్ల సంపదతో కుబేరుల జాబితాలో మస్క్ నెంబర్ వన్‌గా నిలిచారు. మస్క్ సంపదలో ఎక్కువ సంపద టెస్లా నుంచే వస్తున్నది. అయితే, చారిత్రాత్మకంగా ఆదాయం పెరిగినా.. టెస్లా షేర్లు 2021 చివరి మాసం తర్వాత ఆల్‌టైమ్ హై నుంచి 14శాతం వరకు తగ్గాయి.