Friday, September 27, 2024
Homeక్రైంబెట్టింగులకు బానిసై కోటి రూపాయల అప్పు

బెట్టింగులకు బానిసై కోటి రూపాయల అప్పు

Date:

క్రికెట్‌ బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ పట్టణంలో విషాద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గకు చెందిన దర్శన్‌ బాబు, రంజిత (23) కు 2020లో వివాహం జరిగింది. అయితే దర్శన్‌ బాబు బెట్టింగ్‌ వ్యసనం ఉందని రంజితకు అప్పటికి తెలియదు. 2021లో ఆ వ్యసనాన్ని గుర్తించిన రంజిత వద్దని వారించింది. అయినా దర్శన్‌ బాబు వినిపించుకోలేదు. బెట్టింగ్‌ కోసం రూ.1.5 కోట్లు అప్పులు చేశాడు. దాంతో అప్పులు ఇచ్చిన వాళ్ల తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

దాంతో ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని రూ.66 లక్షల అప్పు తీర్చాడు. కానీ మరో రూ.84 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ అప్పును తీర్చే మార్గం లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉండకుండా అప్పులవాళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో అప్పుల వాళ్లు భార్య రంజితను నిదీయడం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలతో వేధించారు. దాంతో మనస్తాపం చెందిన రంజిత ఈ నెల 18న ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఘటనపై మృతురాలు తండ్రి వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పులవాళ్ల వేధింపులే తన కుమార్తె బలవన్మరణానికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పులు ఇచ్చినవాళ్లే తన అల్లుడిని బలవంతంగా బెట్టింగ్‌కు బానిసను చేశారని ఆరోపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.