Friday, September 27, 2024
Homeక్రైంతీహార్ జైళ్లో కవితకు స్పెషల్ సౌకర్యాలు

తీహార్ జైళ్లో కవితకు స్పెషల్ సౌకర్యాలు

Date:

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంటి భోజనంతో పాటు పెన్నులు, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్, ఇంటి నుంచి దుస్తులు పంపించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లగా.. అక్కడ కూడా కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం.

కవితకు ఇంటి భోజనంతో పాటు.. హైబీపీ కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా అనుమతించింది కోర్టు. ఇవే కాకుండా.. ప్రత్యేకంగా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు.. తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇక.. 14 రోజుల రిమాండ్ విధించగా.. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితను ఈడీ అధికారులు ఆమెను విచారించనున్నారు. 9వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

పది రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం రోజున కవితకు ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. అందుకు కోర్టు అనుమతించడంతో కోర్టు నుంచి డైరెక్టుగా కవితను తీహార్ జైలుకు తరలించారు.

మరోవైపు ఢిల్లీ ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు ఏప్రిల్ 1 వరకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటివరకు ఆమెకు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.