Friday, September 27, 2024
Homeక్రైండ్రగ్స్ ఆనవాళ్లకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు..?

డ్రగ్స్ ఆనవాళ్లకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు..?

Date:

హైదరాబాద్‌ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన పలువురిని గుర్తించిన పోలీసులు.. వాళ్లందరికీ కొన్ని టెస్టులు చేశారు. కేవలం ముగ్గురి శరీరాల్లోనే డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. అందులో కొంత మంది తెలివిగా వ్యవహరించి డ్రగ్స్ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారని భావిస్తున్న పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఈ కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కూకట్‌పల్లి కోర్టు అనుమతి కోరగా పోలీసులకు నిరాశే ఎదురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు అనుమతి ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి పరీక్ష క్రోమోటోగ్రఫీ అవుతుంది. ఈ పరీక్ష నిర్వహిస్తే.. డ్రగ్స్ తీసుకున్నవారు ఎవరనేది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటివరకు డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించేందుకు వెంట్రుకలు, గోళ్లు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించేవాళ్లు. అయితే.. ఈ పరీక్ష ద్వారా బయటపడకుండా ఉండేందుకు కొన్ని కిటుకులు ఉండటంతో.. వాటిని కొందరు అవలంభిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ క్రోమోటోగ్రఫీ పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో.. డ్రగ్స్ తీసుకున్న వారు ఇక తప్పించుకోలేరని భావిస్తున్నారు.