Friday, September 27, 2024
Homeక్రైంకరోనా సమయంలో ఐటీ ఉద్యోగం పోయింది

కరోనా సమయంలో ఐటీ ఉద్యోగం పోయింది

Date:

కరోనా ఎన్నో జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. ఐతే కోవిడ్ సమయంలో ఐటీ జాబ్‌ కోల్పోయిన ఒక యువతి దొంగగా మారింది. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి విలువైన ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్నది. తన రాష్ట్రానికి వెళ్లి వాటిని విక్రయిస్తున్నది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో ఆమెను అరెస్ట్‌ చేశారు. 26 ఏళ్ల జస్సీ అగర్వాల్, ఐటీ సంస్థలో జాబ్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వచ్చింది. అయితే కరోనా సమయంలో ఐటీ ఉద్యోగం కోల్పోయింది.

జస్సీ అగర్వాల్ ఆ తర్వాత చోరీల బాటపట్టింది. పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లు, మొబైల్‌ ఫోన్లు చోరీ చేస్తున్నది. వాటిని నోయిడాకు తీసుకెళ్లి బ్లాక్‌ మార్కెట్‌ విక్రయిస్తున్నది. పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉండే ఒక మహిళ తన ల్యాప్‌టాప్‌ చోరీపై ఫిర్యాదు చేసింది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా జస్సీ అగర్వాల్‌ను నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. మార్చి 26న ఆమెను అరెస్ట్‌ చేశారు. రూ.15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.