దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలే లక్ష్యంగా ట్రాకులపై రాళ్లు, పేలుడు పదార్థాలు పెట్టిన ఘటనలు ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌లో కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చివేశారు. దీని వెనక క్రిమినల్ ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగం కాదని అధికారులు వెల్లడించారు.
ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చేసినట్లు పోలీసుల వెల్లడించారు. ఈ ఘటనలో 470 సెం.మీల మేర ట్రాకు పేలిపోయినట్లు తెలిపారు. గోడ్డాలోని లాల్‌మాటియా నుంచి పశ్చిమ బెంగాల్ ఫరక్కాలోని తన పవర్ స్టేషన్‌కు బొగ్గును రవాణా చేసేందుకు ఈ ట్రాక్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీపీసీ వెల్లడించింది.