Saturday, December 7, 2024
Homeక్రైంన‌టి క‌స్తూరికి ముంద‌స్తు బెయిల్ నిరాక‌ర‌ణ

న‌టి క‌స్తూరికి ముంద‌స్తు బెయిల్ నిరాక‌ర‌ణ

Date:

త‌మిళ‌నాడుకు చెందిన సినీ న‌టి క‌స్తూరికి మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటుంటే.. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను తెలుగువారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.