9వ తరగతి చదువుతున్న బాలుడు స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఏకంగా తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నజాఫ్‌గఢ్ ప్రాంతంలో తల్లితో కలిసి నివసిస్తున్న బాలుడు ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాస్‌మేట్ అయిన స్నేహితురాలి పుట్టిన రోజున సప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. దీని కోసం తల్లిని డబ్బు అడిగాడు. నిరాకరించిన ఆమె చదువుపై దృష్టిపెట్టాలని కొడుకును మందలించింది.
ఆగస్ట్ 2న ఆ మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఆమెకు చెందిన రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు, ఒక బంగారు ఉంగరం మాయమయ్యాయి. ఆ మరునాడు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత బయట నుంచి ఎవరూ చోరీకి పాల్పడలేదని గ్రహించారు. తండ్రి మరణించడంతో తల్లితోపాటు ఉంటున్న కుమారుడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని ప్రశ్నించగా తల్లి బంగారాన్ని తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించినట్లు తెలిపాడు. రూ.50,000 ఖరీదైన ఐఫోన్ కొని పుట్టిన రోజున స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పాడు.