Tuesday, October 15, 2024
Homeక్రైంకొత్త ఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని స్నేహితుడు హత్య

కొత్త ఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని స్నేహితుడు హత్య

Date:

ఓ యువ‌కుడి కొత్త మొబైల్‌ కొన్న ఆనందం కాసేప‌ట్లోనే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సచిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఢిల్లీలోని సకర్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం స్నేహితుడితో కలిసి మొబైల్ షాపుకి వెళ్లాడు. కోరుకున్న కొత్త మొబైల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముగ్గురు స్నేహితులు తారసపడ్డారు. కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. స్నేహితుల్లో ఒకడు కత్తి తీసుకుని సచిన్‌ను పొడిచాడు. బలంగా పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడను ఆస్పత్రికి తరలించారు. అయితే సచిన్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం షకర్‌పూర్‌లో పోలీసులు ఒక వీధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానికులను వాకబు చేయగా.. స్నేహితుల మధ్య గొడవ జరిగి.. ఒకరిని కత్తితో పొడిచారని చెప్పారు. బాధితుడిని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేర్చినట్లుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అప్పటికే బాలుడు మరణించాడు. వెనుక భాగంలో రెండు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొత్త ఫోన్ కొన్నందుకు స్నేహితులు ట్రీట్ అడిగారని.. ఈ విషయంలో ఘర్షణ జరిగి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సంఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముగ్గురు కూడా 16 ఏళ్ల వయసు వారేనని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.