Saturday, December 7, 2024
Homeఆంధ్రప్రదేశ్2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి దర్శన భాగ్యం

2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి దర్శన భాగ్యం

Date:

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి వ‌చ్చే భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తితిదే నిర్ణయించింది. తితిదేలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌ నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 3:30 గంటలకు వరకు సుదీర్ఘంగా కొనసాగింది. అజెండాలోని 80 అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. గత ఐదేళ్లలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేశారు. సమావేశం వివరాలను బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు.

శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ” తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నాం. అలిపిరిలో టూరిజం కార్పోరేషన్ ద్వారా దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని తితిదేకి ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరతాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం” అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.