Tuesday, October 15, 2024
Homeఆంధ్రప్రదేశ్టీచ‌ర్లు ఇబ్బంది పెడుతున్నార‌ని విద్యార్థులు ప‌రార్‌

టీచ‌ర్లు ఇబ్బంది పెడుతున్నార‌ని విద్యార్థులు ప‌రార్‌

Date:

గురుకుల పాఠ‌శాల హ‌స్ట‌ల్‌లోని టీచ‌ర్లు నిత్యం ఇబ్బంది పెడుతున్నారంటూ విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే ప్రహరీ గోడ దూకి 67 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. గమనించిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులను అక్కడే పట్టుకున్నారు. మిగిలిన 35 మంది సమీపంలోని కొండవీటి కొండలపైకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు 16వ నంబరు హైవే పక్కన ఉన్న తుమ్మపాలెం వద్ద విద్యార్థులను గుర్తించి పాఠశాలకు తీసుకెళ్లారు.

అనంతరం నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్‌ సీఐ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమను ఉపాధ్యాయులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. నాణ్యమెన ఆహారం, సరిపడా మంచి నీరు అందించడంలేదన్నారు. ఆటలు ఆడుకునేందుకు అవకాశం కల్పించడంలేదని, ఉచిత విద్యకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నిజానిజాలను విచారించి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. అప్పటివరకు విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దన్నారు.