Sunday, September 29, 2024
HomeUncategorizedవడదెబ్బ సోకకుండా ఇలా చేయండి

వడదెబ్బ సోకకుండా ఇలా చేయండి

Date:

ఎండలు మండుతున్నాయి.. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల కారణంగా బయట పని చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇది వేడి అలసటతో కూడిన తీవ్రమైన పరిస్థితి. తక్షణమే చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చు. వడదెబ్బకు గురైతే, సహజ శీతలీకరణకు కారణమయ్యే చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో విఫలమవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. వడదెబ్బ అనేది అధిక ఉష్ణోగ్రతలకు బహిర్గతం కావడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య. ఇది డీహైడ్రేషన్‌తో శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. WebMD ప్రకారం.. కోర్ శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా పెరగడం వల్ల వికారం, మూర్ఛ, అపస్మారకస్థితి వంటి లక్షణాలకు దారితీయవచ్చు.

*వడదెబ్బ లక్షణాలు

శరీరం వడదెబ్బకు గురైతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. మైకం కమ్ముకొస్తుంది. శరీరం వేడిగా ఉన్నప్పటికీ చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం, ఎరుపెక్కడం, వేడిగా మారవచ్చు. కండరాల తిమ్మిరి, బలహీనత, వాంతులు, వికారం, గుండె కొట్టుకునే వేగం మరింత పెరగడం, శ్వాస ప్రక్రియలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయోమయం, గందరగోళం, మూర్ఛపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

*వడదెబ్బకు చికిత్స

  • చన్నీటి స్నానం

మండే వేసవిలో వడదెబ్బ బారిన పడితే బాధితుడికి చన్నీటి స్నానం చేయించాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను చాలావరకు తగ్గిస్తుంది. మరణం, అవయవ నష్టం ముప్పును నివారిస్తుంది.

  • ఐస్ ప్యాక్‌

వడదెబ్బ బారినపడినవారు వీపు, మెడ, గజ్జలు, చంకలు వంటి ప్రదేశాల్లో ఐస్ ప్యాక్‌లతో మర్దన చేసుకోవాలి. లేదా శీతలీకరణ ప్రభావం ఉండే దుప్పటితో కప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. వడదెబ్బ బారినపడిన వారిని వెంటనే చల్లగా గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ వాటర్, ఓఆర్ఎస్ తాగించాలి. దీంతో వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి బీపీ హెచ్చుతగ్గులతో కార్డియాక్‌ అరెస్ట్‌ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

  • ముందు జాగ్రత్తలు ముఖ్యం

వడదెబ్బకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిమాణాలకు దారితీయవచ్చు. శరీరంలో ఏదైన అవయవానికి నష్టం వాటిల్లవచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ ముప్పు తప్పించుకోవడానికి వేసవిలో తరచుగా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. పగటి సమయంలో నీడ పాటున ఉండాలి. ఇంట్లో కూలర్, ఏసీ వంటి వాటిని ఉపయోగించుకోవాలి.

ఈ వేసవిలో ఎక్కువ తీవ్రత ఉండే పనులకు దూరంగా ఉండాలి. సహజ శీతలీకరణ కోసం మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పుదీనా వాటర్, సబ్జా వాటర్ వంటివి తరచూ తాగాలి. వేసవిలో లేత రంగులో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి శరీరం చెమటను త్వరగా పీల్చుకుని చికాకును నివారిస్తాయి. ఎండలకు తిరిగేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలకు టోపీ ధరించాలి. ఎండ అధికంగా ఉండే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.