Sunday, September 29, 2024
HomeUncategorizedఎండ తీవ్రతకు ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్స్‌

ఎండ తీవ్రతకు ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్స్‌

Date:

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నిత్యం రోడ్డుపై నిల్చొని వాహనాలను కంట్రోల్‌ చేసే ట్రాఫిక్‌ పోలీసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గుజరాత్‌ రాష్ట్రం వడోదరా ట్రాఫిక్‌ పోలీసులు ఓ ఉపాయం ఆలోచించారు. ఇందులో భాగంగానే ఎయిర్ కండిషనర్స్‌తో కూడిన హెల్‌మెట్స్‌ను పరిచయం చేశారు. 40 – 42 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతల సమయంలో శీతలీకరణ ఉపశమనాన్ని అందించేందుకు ఈ ఏసీ హెల్మెట్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హెల్‌మెట్స్‌లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇవి సూర్యకాంతి నుంచి కళ్లకు రక్షణ ఇస్తాయి కూడా. ఇక ఇవి పూర్తిగా ఛార్జింగ్‌తో నడుస్తాయి. వీటికి ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే.. దాదాపుగా 8 గంటల వరకూ కూలింగ్‌ను అందించగలవు.

ప్రయోగాత్మంగా ఈ హెల్మెట్స్‌ను వడోదరా ట్రాఫిక్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రవేశపెట్టింది. వీటిని పెట్టుకుని పలువురు ట్రాఫిక్‌ కాప్స్‌ రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన కొందరు మంచి ఆలోచన అంటూ వడోదరా ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ను పొగుడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్‌ విభాగాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.