Sunday, September 29, 2024
HomeUncategorizedఉద్యోగం చేసే చోట సిఐ అవమానించాడు

ఉద్యోగం చేసే చోట సిఐ అవమానించాడు

Date:

ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కానీ అతడి ఈ విజయం వెనుక ఉన్న పట్టుదల ఎలాంటిది అన్న విషయం తాజాగా వెల్లడైంది. దీంతో అంతా అతడిని ప్రశంసిస్తున్నారు.

2013 నుంచి 2018 వరకూ ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ గా పనిచేసాడు. ఆ సమయంలో తన ఉన్నతాధికారి (సీఐ) చేతిలో కృష్ణారెడ్డికి ఓ రోజు తీరని అవమానం జరిగింది. దీంతో ఆయన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అంతే కాదు ఎలాగైనా సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం రాత్రీ పగలూ శ్రమించాడు. సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు.

గతంలో సీఐ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని, అదే రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ కావడం మొదలుపెట్టానని కృష్ణారెడ్డి యూపీఎస్సీ ఫలితాల ప్రకటన అనంతరం తెలిపాడు. వ్యక్తిగత ద్వేషం కారణంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని, అప్పుడే యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం తాను సాధించిన 780వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఉద్యోగం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి సివిల్స్ రాసి ఎలాగైనా ఐఏఎస్ సాధిస్తానని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించే వరకూ ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని చెప్తున్నాడు.