Friday, September 27, 2024
HomeUncategorizedఎండిన పంటలను పరిశీలించనున్న కేసీఆర్

ఎండిన పంటలను పరిశీలించనున్న కేసీఆర్

Date:

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడితో అందరూ బిజిబిజీ ఉండగా మరోవైపు కరవు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినటమే కాదు.. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతలకు అండగా ఉండేందుకు.. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం రోజున.. కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి.. ఎండిన పంటలను పరిశీలించిన, బాధిత రైతులకు భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే.. సూర్యాపేట‌, న‌ల్లగొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్యటించనున్నారు.

కేసీఆర్ పర్యటనలో భాగంగా.. ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బ‌య‌ల్దేరనున్నారు. జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10 గంట‌ల‌ 30 నిమిషాలకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 11 గంట‌ల‌ 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగ‌తుర్తి మండ‌లం, అర్వప‌ల్లి మండ‌లం, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో ప‌ర్యటించి.. ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు సూర్యాపేట రూర‌ల్ మండ‌లం నుంచి బ‌య‌ల్దేరి.. ఒకటిన్నర వ‌ర‌కు సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే లంచ్ చేయ‌నున్నారు. 3 గంట‌ల‌కు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం మూడున్నరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి న‌ల్గొండ జిల్లాకు బ‌య‌ల్దేరుతారు. సాయంత్రం నాలుగున్నరకు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని ఎండిపోయిన పంటల‌ను ప‌రిశీలించ‌నున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి ఎర్రవెల్లికి బ‌య‌ల్దేర‌నున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 7 గంట‌ల‌కు కేసీఆర్ ఎర్రవెల్లికి చేరుకోనున్నారు.