Friday, September 27, 2024
HomeUncategorizedకేజ్రివాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందన

కేజ్రివాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందన

Date:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు రోజురోజుకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి అగ్రదేశాలు కేజ్రివాల్ అరెస్టును తప్పుబడుతూ భారత్ కు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించాయి. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సైతం ఆయన అరెస్టుపై స్పందించింది. భారత్ లో మానవ హక్కుల్ని కాపాడాలని పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం మరింత ఇరుకునపడుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్.. భారత్ లో ప్రతీ ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఉన్న ఏ దేశంలోనైనా, రాజకీయ నేతలు, పౌరులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. హక్కులు ఉంటేనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయమైన వాతావరణంలో ఓటు వేయగలరన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన నేపథ్యంలో భారతదేశంలో నెలకొన్న రాజకీయ అశాంతిపై ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇప్పటికే భారత్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. అమెరికా మాత్రం కేజ్రివాల్ అరెస్టుతో పాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభనను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. భారత్ లో న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూల చట్ట ప్రక్రియలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది. దీంతో కేంద్రం దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. ఇవాళ ఐరాస కూడా కేజ్రివాల్ అరెస్టుపై స్పందించడంతో కేంద్రం అంతర్జాతీయ స్ధాయిలో దేశం పరువు కాపాడేందుకు ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.