Friday, September 27, 2024
HomeUncategorizedకేసీఆర్‌ ఇచ్చిన గౌరవం మరిచిపోలేను

కేసీఆర్‌ ఇచ్చిన గౌరవం మరిచిపోలేను

Date:

కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు కేకే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పలువురు నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు తెలిసింది. కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

తెలంగాణ గురించి టీఆర్​ఎస్​ (బీఆర్​ఎస్)​ కంటే ముందే కాంగ్రెస్‌ ఆలోచించిందని ఎంపీ కె కేశవరావు తెలిపారు. బాగారెడ్డి ఛైర్మన్‌గా కాంగ్రెస్ ఫోరం ఫర్‌ తెలంగాణ ఏర్పాటు జరిగిందన్న కేకే.. రాజీనామా చేస్తామని 42 మంది ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారని గుర్తు చేశారు. 1998 నుంచి తెలంగాణ గురించి పోరాటం మొదలైందన్నారు. తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారని కేకే గుర్తు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్‌​ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని కేకే చెప్పారు. ఏం చేసినా కేడర్‌ను దూరం చేసుకోకూడదని సూచించారు. భారత రాష్ట్ర సమితి, కేసీఆర్‌ ఇచ్చిన గౌరవం మరిచిపోలేనన్నారు కేకే. అయితే, కొన్ని సరి చేసుకోవాల్సినవి బీఆర్​ఎస్​ సరి చేసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తాను ఘర్‌ వాపస్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు కేశవరావు తెలిపారు.