Friday, September 27, 2024
HomeUncategorizedమోడీ కన్నుసన్నల్లోనే ఈడీ, సీబీఐ

మోడీ కన్నుసన్నల్లోనే ఈడీ, సీబీఐ

Date:

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఐటీ శాఖ జారీ చేస్తున్న నోటీసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యే 200 కోట్లకు పైగా చెల్లించాలంటూ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల్ని సీజ్ చేయడమే కాకుండా అందులో ఉన్న రూ.135 కోట్లను లాగేసుకున్న ఐటీ శాఖ శుక్రవారం మరో రూ.1700 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. దీంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఐటీ నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

కేంద్ర దర్యాప్తు సంస్ధలైన ఈడీ, సీబీఐ మోడీ కన్నుసన్నల్లోనే పనిచేస్తున్నాయని, ప్రభుత్వం మారగానే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారు. ఇది తన గ్యారంటీ అన్నారు. సీబీఐ, ఈడీ వాటి పని అవి చేస్తే ఎలాంటి ఇబ్బందీ లేదు, అలా కాకుండా తమను టార్గెట్ చేస్తూ ఒకరోజు బీజేపీ ప్రభుత్వం మారుతుందని, అప్పుడు బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు ఉంటాయని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. ఆ చర్యలు కూడా ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో ఇంకెవరూ ఇలాంటి పనులు చేయకూడదన్నారు.

ఐటీ శాఖ తాజాగా పంపిన రూ.1700 కోట్ల రూపాయల నోటీసులకు తోడు గతంలో చెల్లించాల్సిన వాటితో కలుపుకుని మొత్తం రూ.1823 కోట్ల రూపాయలకు నోటీసులు పంపాలని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీజేపీ చెల్లించాల్సిన రూ.4617 కోట్లకు సంబంధించి కూడా నోటీసులు పంపాలని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ డిమాండ్ చేసారు. ఐటీ శాఖ చర్యల్ని టాక్స్ టెర్రరిజం (పన్ను తీవ్రవాదం)గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. కేంద్రం చర్యలకు నిరసనగా రేపు దేశవ్యాప్తగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.