Friday, September 27, 2024
HomeUncategorizedతెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు

తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు

Date:

తెలంగాణ రాష్ట్రంలో ఎండల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు ఉష్ణోగ్రతల విషయానికి వస్తే కనిష్టంగా 39 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

రాబోయే మరో మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఉగ్ర భానుడు నిప్పులు చెరుగుతాడని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఎండల ధాటికి వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది.

నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబ్ నగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడగాలుల బారిన పడకుండా వారిని వారు రక్షించుకోవాలి. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని సమయానుకూలంగా పనులను ప్లాన్ చేసుకోవాలి. విపరీతమైన ఎండల్లో తిరగటం మంచిది కాదని సూచన. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయని, వడగాలులు వీచే అవకాశం ఉందని ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొంది. తెలంగాణ, ఏపీ లతో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.