Friday, September 27, 2024
HomeUncategorizedఏప్రిల్‌ 1వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

ఏప్రిల్‌ 1వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

Date:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు అతడిని ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెల్లడించింది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఇంకా విచారించేందుకు మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. ఏప్రిల్‌ 1వ తేదీన ఉదయం 11గంటలకు తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.

కేజ్రీవాల్‌ను విచారించే సమయంలో ఐదు రోజులు స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశామని.. ఆయన దాటవేత సమాధానాలను చెబుతున్నారని ఈడీ ఆరోపించింది. డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను ఆయన వెల్లడించలేదని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. అదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను సైతం రికార్డు చేసినట్లు తెలిపింది. అంతకముందు కేజ్రీవాల్‌ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని.. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా? అని ‘ఈడీ’ని ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం ముందు ‘ఆప్‌’ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ అన్నారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ‘ఈడీ’ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ మద్యం విధానం కేసు ‘రాజకీయ కుట్ర’ అని.. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను రౌస్‌ అవెన్యూ కోర్టులో నేడు హాజరుపరిచారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్తున్న సమయంలో అక్కడున్న విలేకరులతో ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు.