Friday, September 27, 2024
HomeUncategorizedఆడ సింహాల్లో వేగం, వేట రెండు ఎక్కువే

ఆడ సింహాల్లో వేగం, వేట రెండు ఎక్కువే

Date:

అడవికి రారాజు సింహాం అనే పేరు ఉంది. వేటాడి, మాంసం తినడంలో సింహాలు ఎప్పుడు ముందే ఉంటాయి. బలమైన దవడలు, పదునైన పంజాలతో అడవిలో అవి సాటిలేని జంతువుల్లా అరణ్యంలో తిరుగుతుంటాయి. సింహాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి భూములు, అడవులు, సవన్నా ప్రాంతాలలో నివసిస్తాయి. అయితే వేట విషయంలో మగ సింహాలతో పోలిస్తే, ఆడవే ముందుంటాయి. ఆడ సింహాలు సులభంగా వేటాడతాయి, పిల్లలను పెంచుతాయి. మగవి సింహాల గ్రూపులను రక్షిస్తాయి. వేటలో మగవాటి కంటే ఆడ సింహాలకు ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. సైజులో మగ సింహాల కంటే చిన్నవే అయినా, వాటికి వేటలో చాలా ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉన్నాయి. అడవిలో బెస్ట్ హంటర్స్‌ అయిన ఆడ సింహాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

ఆడ సింహాల్లో వేగం ఎక్కువ

ఆడ సింహాలు చాలా వేగంగా, చురుగ్గా ఉంటాయి. చిన్న సైజు కారణంగా వేట సమయంలో చాలా స్పీడ్‌తో, కచ్చితంగా కదలగలవు. ఎరను వెంబడించేటప్పుడు ఓపికగా, చాకచక్యంగా, శబ్దం చేయకుండా వ్యవహరిస్తాయి. ఇవి చెట్లు, పొదల చాటున దాక్కొని, చుట్టుపక్కల వాతావరణంతో ఒకటిగా కలిసిపోతాయి. సరైన సమయం చూసి, ఒక్కసారిగా దాడి చేసి ఎరను పట్టుకుంటాయి. ఈ ఆడ సింహాల వేట నైపుణ్యం వల్లనే, ఒక ప్రైడ్ (సింహాల సమూహం) ఆహారం కోసం ఎప్పుడూ ఇబ్బంది పడదు. మగ సింహాలు బలం మీద ఎక్కువగా ఆధారపడతాయి, కానీ ఆడ సింహాలు వ్యూహాత్మకంగా, దొంగతనంగా వేటాడతాయి.

పరుగెత్తడంలో ముందే

బయాలజికల్ యాంగిల్‌లో చూస్తే, ఆడ సింహాలు మగ సింహాల కంటే చిన్నవి. ఒక మగ సింహం ముక్కు నుంచి తోక వరకు సగటున పది అడుగుల పొడవు ఉంటే, ఆడ సింహం సగటున తొమ్మిది అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. సైజులో చిన్నగా ఉన్నా, ఆడ సింహాల చురుకుదనం మగ సింహాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మగ సింహాం గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగితే, ఆడ సింహం గంటకు 72 కిలోమీటర్ల అద్భుతమైన వేగంతో దూసుకెళ్లగలదు.

పిల్లలకు వేటాడటం నేర్పిస్తాయి

ఆడ సింహాలు ప్రైడ్ (సింహాల సమూహం)ను నిలబెట్టుకోవడానికి వేటాడతాయి. వాటి ప్రధాన లక్ష్యం తమ సమూహానికి ఆహారం అందించడం. ఒక జంతువును వేటాడి చంపేశాక మొదట మగ సింహాలు తింటాయి. తర్వాత ఆడ సింహాలు, చివరగా పిల్లలు తింటాయి. మగ సింహాలు భూభాగాన్ని కాపాడితే, ఆడ సింహాలు పిల్లలను చూసుకుంటాయి. ఆడ సింహాలు పిల్లలకు వేటాడటం, జీవించడం నేర్పిస్తాయి.

ఒంటరిగా వేటాడుతాయి

ఆడ సింహాలు చాలా సందర్భాలలో ఒంటరిగా వేటాడతాయి. ఈ అలవాటు కారణంగా అవి చాలా ఏకాగ్రత, చురుకుదనాన్ని డెవలప్ చేసుకుంటాయి. అయితే గేదె లేదా ఇతర భారీ జంతువులను వేటాడేటప్పుడు, ఆడ సింహాలు ఒక బృందంగా పనిచేస్తాయి. వారి కలిసి దాడులు చేస్తే ఎంత బలమైన జంతువైనా నేలకూలాల్సిందే.