Friday, September 27, 2024
HomeUncategorizedఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు నిరాశే

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు నిరాశే

Date:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు గడువును ఇచ్చిన కోర్టు.. విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి కేసు విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం తప్పని.. సీఎంను విడుదల చేయాలని సింఘ్వీ వాదనలు కోర్టును కోరారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు పరిశీలిస్తుందని.. ప్రధాన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ్‌కాంత శర్మ తెలిపారు. కేజ్రీవాల్‌ మధ్యంతర ఉపశమనం కోరితే.. దాన్ని పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీరాజు వ్యతిరేకిస్తూ సమాధానం ఇచ్చేందుకు సమయం కోవాలని కోరారు.